Listen

Description

అహల్య అందం అమాయకత్వం కలబోసిన రూపంలా మనకు కనిపిస్తుంది. గౌతమ మహర్షి భార్యగా ఉన్నా తనలో కోరికల్ని అణగార్చుకోలేని స్త్రీగా కొందరు అధునికులు చిత్రీకరించారు. ఇంద్రుడి మాయారూపం తెలుసుకోలేనందుకు గౌతమ మహర్షి ఆగ్రహానికి గురయ్యింది. స్పర్శార్హత కోల్పోయి రాయిలా మారిపోయింది.
అహల్య వృత్తాంతం మనకు వాల్మీకి రామాయణం బాలకాండలో కనిపిస్తుంది. అహల్య అపురూప సౌందర్య రాశి. బ్రహ్మ తన శక్తియుక్తులను ప్రయోగించి అహల్యను సృష్టిస్తాడు. అందుకే తను అయోనిజ. యుక్త వయసు రాగానే వివాహం చేయాలని అనుకుంటాడు. ఎవరైతే ముల్లోకాలు ముందుగా చుట్టి వస్తారో వారే అర్హులు అని ప్రకటిస్తారు. ఇంద్రుడు తయ మాయాజాలంతో అందరికంటే ముందుగా ముల్లోకాలు చుట్టి వచ్చాను కాబట్టి అహల్యతో వివాహ అర్హత తనకుందని అంటాడు. అంతలో నారదుడు వచ్చి...ఇంద్రా నీకంటే ముందు గౌతమ మహర్షి ముల్లోకాలు చుట్టాడని చెబుతాడు. నిండుచులాలైన గోమాత చుట్టూ ప్రదక్షిణ చేశాడు. ఆ సమయాన గోమాతలో ముల్లోకాలుంటాయి...అని చెబుతాడు. అలా అహల్య గౌతమ మహర్షి భార్య అయింది. అయితే ఇంద్రుడు ఓ రోజు ఉదయం గౌతముడిగా వచ్చి ఆమెతో శృంగారంలో పాల్గొంటాడు. నదికి వెళ్ళిన మహర్షి తిరిగి వచ్చి విషయం తెలుసుకుని కోపంతో అహల్య , ఇంద్రుడు ఇద్దరిని శపిస్తాడు. అహల్య రాయిలా, ఇంద్రుడు సహస్రాక్షుడిగా మారిపోతారు. ఇది పురాణ కథ.
అనుకోని ఘటనలో తన ప్రమేయం లేకుండానే నిందితురాలవుతుంది. వెయ్యేళ్ళు రాయిలా శిక్షఅనుభవిస్తుంది. రామచంద్రుని పాదస్పర్శతో మళ్లీ జీవం పోసుకుంటుంది. ఇంద్రియాలను నిగ్రహించుకోలేక భర్త రూపంలో ఉన్న ఇంద్రునికి అందాన్ని అర్పించుకుంటే నేరం ఎలా అవుతుంది? ఒకవేళ అహల్య చేసింది తప్పే అయితే ...ఇంద్రుడు చేసిందీ తప్పే. మరి ఇంద్రుడికి శాపం తగ్గించినపుడు అహల్యకు ఎందుకు ఈ మినహాయింపు దక్కలేదు...వివక్షకు మరో రూపంలా అహల్య మనకు కనిపిస్తుంది. ఈ రోజు ఇతిహాసాలు=ఇంతులు ధారావాహికలో అహల్య వృత్తాంతం గురించి మనతో చర్చించడానికి రామదుర్గం మధుసూదనరావు మనతో ఉన్నారు.