మహాభారతంలో రకరకాల మనస్తత్వాలున్న పాత్రలు ఎన్ని ఉన్నా...అన్నిటికన్నా ప్రత్యేకంగా కనిపించే పాత్ర ద్రౌపది. ద్రుపద మహారాజు కుమార్తె ద్రౌపది కష్టనష్టాలెన్ని ఎదురైనా ఏ మాత్రం కుంగిపోని ధీర మహిళ. అనుకున్నది సాధించాలన్న తపన ఉన్న వనిత. ద్రౌపదిని మనం ఉదాత్తంగా కాకుండా సహజంగా చూడాలి. ఆమె అందరి స్త్రీల్లాగానే కష్టాలొస్తే కుంగిపోయింది...కాసింత సంతోషం వచ్చినా పొంగిపోయింది. రాణిగా మెట్టినింటికి వచ్చినా...తను ఎదుర్కోని సమస్యంటూ ఏదీ లేదు. పాండవులు జూదంలో అన్నీ కోల్పోయినా...ఆఖరుకు తన్ను జూదంలో ఒడ్డినా తడబడలేదు. నిండు సభలో కౌరవులు అవమాన పరిస్తే అన్న కృష్ణుడితో మొర పెట్టుకుంది. భర్తలు అరణ్యవాసం...అజ్ఞాత వాసానికి వెళితే తను అంత:పురానికే పరిమితం కాలేదు. వారితోపాటు వెళ్ళింది. అప్పుడూ ఎన్నో అవమానాలు...కీచకుడు వెంటపడితే జాగరూకతతో భీముణ్ణి ఉసిగొల్పి హతమార్చింది. సగటు స్త్రీ మనోభావాలు ఎలా ఉండాలో...ఎలా ఉంటాయో తనకూ అలాగే ఉంది. భర్తల తీరును నిరసించింది. కౌరవులపై తిరగబడలేని అశక్తతను నిందించింది. అందుకే ద్రౌపది పేరు తలచుకుంటే మహిళలు తమకు జరిగే అన్యాయాలు...అవమానాలపై ఎలా స్పందించాలో తెలుస్తుంది. ఈ రోజు ఇతిహాసాలు...ఇంతులు ధారావాహికలో...మహాభారతంలో ద్రౌపది అంశంపై చర్చించడానికి మనతో సీనియర్ జర్నలిస్ట్, రచయిత రామదుర్గం మధుసూదన్ రావు ఉన్నారు.