Listen

Description

జీవితంతో సహా, ప్రతి భౌతిక వ్యవస్థ అనేక అంశాలు,
స్పందనలను సంగ్రహించి అనేక ఫలితాలను వెలువరిస్తుంది. మనం మన మాటల యొక్క, చేతల యొక్క ఫలితాలను నిరంతరం అంచనా వేసుకుంటూ మంచి, చెడు అని నిర్ధారిస్తూ ఉంటాము. ఇతరుల ప్రవర్తనను గురించి, మన చుట్టూ ఉన్న పరిస్థితుల గురించి కూడా ఇలాగే నిర్ధారిస్తూ ఉంటాము. పరిణామ క్రమంలో పొంచి ఉన్న ప్రమాదాలను అంచనా వేయడానికి ఈ సమర్థత మనకు ఎంతగానో ఉపయోగపడింది. కానీ ఇటువంటి నిర్ధారణలకు వైజ్ఞానిక ప్రమాణాలు లేకపోవడం వల్ల మనం ఈ నిర్ధారణల కోసం అజ్ఞానంతో కూడుకున్న ఊహలు, అభిప్రాయాలు, విశ్వాసాలు, నమ్మకాలు మీద ఆధార పడతాము. మన నమ్మక వ్యవస్థకి అనుగుణంగా పనులు జరిగితే సంతోషిస్తాము, లోకపోతే దుఃఖిస్తాము.

“మనస్సును వశమునందు ఉంచుకొన్నవాడు, జితేంద్రియుడు, అంతఃకరణ శుద్ధి గలవాడు, సర్వప్రాణులలో ఆత్మ స్వరూపుడైన పరమాత్మను తన ఆత్మగా కలవాడు అగు కర్మయోగి కర్మలను ఆచరించుచున్నను ఆ కర్మలు వానిని అంటవు” అని ఈ సందర్భంగా శ్రీకృష్ణుడు అంటారు (5.7). ఇది మన కర్మలు ఎప్పుడు కలుషితం కావో అన్న దాని గురించి భగవంతుడు మనకు ఇచ్చిన హామీ.

“ద్వేషము, కోరికలు లేని వ్యక్తి ఏ కర్మ చేసినా అది కలుషితం కాదు” అని శ్రీకృష్ణుడు విశదీకరించారు (5.3). అందరిలోనూ తననే చూసుకున్నప్పుడు కలుషిత చర్యలు లేక నేరాలను చేయలేరన్నది గమనించాల్సిన విషయం. దీని యొక్క మరో అర్ధం ఏమిటంటే ఎవరైతే నేను, వాళ్ళు అనే విభజన దృష్టితో కర్మలను చేస్తారో వారి అన్ని కర్మలు కలుషితమవుతాయి.

"కర్మలన్నింటినీ భగవదర్పణము గావించి, ఆసక్తి రహితముగా కర్మల నాచరించు వానికి, తామరాకుపై నీటి బిందువుల వలె పాపములు అంటవు” అని శ్రీకృష్ణుడు అంటారు (5.10). అంటే తామర ఆకులాగా ఆ వ్యక్తి చుట్టుప్రక్కల ఉన్న పరిస్థితులలో జీవిస్తూ కూడా వాటి ప్రభావానికి లోనుకాకుండా
ఉండగలుగుతాడు.

మన కర్మలు, ఇతరుల కర్మలు కూడా భగవంతునికి
అంకితమైనప్పుడు విభజనకు తావే లేదు. అప్పుడు మనం ఎదుర్కొనే పరిస్థితులు నాటకాల్లాగా, ఆటల్లాగా అనిపిస్తాయి. ఇందులో మనం కేవలం మన పాత్రను పోషిస్తాము. శ్రీకృష్ణుడు దీనిని నీటిలో ఉంటూ నీటిని అంటని తామరాకుతో పోలుస్తారు.