బఠానీ గింజ పరిమాణములో, శంకు ఆకారంలో ఉండే పీనియల్
గ్రంథి మెదడు యొక్క కేంద్రంలో సరిగ్గా రెండు కనుబొమల మధ్యన ఉంటుంది. శారీరకంగా ఇది మెలటోనిన్, సెరటోనిన్ అనే నాడీ ప్రసారకాలను (neurotransmitters) ఉత్పత్తి చేసి మన నిద్రకు, భావోద్వేగాలకు కారణమవుతుంది. దీనిలో మామూలు కంటిలాగే కాంతి గ్రాహకాలు (photo receptors) ఉంటాయి కనుక దీనిని 'మూడవ కన్ను' అంటారు.
ఇది ఆత్మకు పీఠమని, ఆధ్యాత్మిక సాక్షాత్కారానికి కారణమని;
పంచేంద్రియాలకు అందని భావనను అందుకోగలిగే ఆరో ఇంద్రియమని; ఆధ్యాత్మిక జాగృతికి సంకేతమని; భౌతిక, ఆధ్యాత్మిక జగతికి మధ్య సంధానమని అనేక సంస్కృతులు దాన్ని అనేక విధాలుగా వర్ణించాయి. భారతీయ పరిభాషలో కనుబొమల మధ్య ఉండే ప్రదేశాన్ని 'ఆజ్ఞా చక్రం' అంటారు. ఇది పీనియల్ గ్రంథి ఉండే స్థానాన్ని సూచిస్తుంది.
ఇంద్రియాలు, మనస్సును అదుపులో పెట్టేమార్గంలో
శ్రీకృష్ణుడి విధానాన్ని అర్థం చేసుకోవడానికి పై వివరణ మనకు ఉపకరిస్తుంది. “బాహ్య విషయ భోగములను చింతన చేయక వాటిని పారద్రోలవలెను. దృష్టిని భ్రూమధ్యమునందు స్థిరముగా ఉంచవలెను. నాసిక యందు ప్రసరించుచున్న ప్రాణాపాన వాయువులను సమస్థితిలో నడుపవలెను. ఈ ప్రక్రియల ప్రభావమున మనస్సు, బుద్ధి, ఇంద్రియములు సాధకుని వశములోనికి వచ్చును. ఇట్టి సాధన వలన మోక్షపరాయణుడైన ముని ఇచ్ఛా భయక్రోధ రహితుడై సదా ముక్తుడగును” అని శ్రీకృష్ణుడు ధ్యానానికి ఒక మార్గాన్ని సూచించారు (5.27-28). అర్జునుడుకి తన ఇంద్రియాలను, మనస్సును, బుద్ధిని నియంత్రించడానికి భగవానుడు ఈ విధానము అందించారు.
'విజ్ఞాన భైరవ తంత్ర' లో పరమశివుడు చెప్పిన 112 ధ్యాన విధానాలు ఉన్నాయి. అందులో ఒక ధ్యాన విధానం “ఎటువంటి ఆలోచనలు లేకుండా మీ కనుబొమల మధ్య ఉన్న బిందువు పై దృష్టి కేంద్రీకరించండి. దివ్యమైన శక్తి ప్రజ్వలితమై మీ తల యొక్క అగ్ర భాగం వరకు వ్యాపిస్తుంది. తక్షణమే మిమ్మల్ని పరమానందంలో ముంచేస్తుంది” అని చెప్తుంది. మన
దృష్టిని గాయపడిన భాగాల వైపు మళ్లించేందుకు నొప్పి అనేది ఒక సాధనం. ఇది మన ఆరోగ్య జీవనానికి ఉపయోగపడుతుంది. అలాగే అవగాహనతో కూడిన దృష్టిని కనుబొమల మధ్య ప్రాంతానికి తీసుకువచ్చి పీనియల్ గ్రంధిని సక్రియం చేయాలి. ఈ క్రియాశీలత ఇంద్రియాల నుండి ఎటువంటి సహాయం లేకుండా మనలో అంతర్గత పారవశ్యాన్ని నింపుతుంది.