“ఓ అర్జునా! ఇంద్రియములు ప్రమథన శీలములు. మనుష్యుడు వాటిని నిగ్రహించుటకు ఎంతగా ప్రయత్నించినను, ఆసక్తి తొలగి పోనంతవఱకు అవి అతని మనస్సును ఇంద్రియార్ధముల వైపు బలవంతముగా లాగికొనిపోవుచునే యుండును” అని శ్రీకృష్ణుడు అర్జునుడిని హెచ్చరించారు (2.60). ఈ శ్లోకం, బాహ్య ఇంద్రియ విషయాలకు ఇంద్రియాల స్వయంచాలకతను గురించి చెప్తుంది.
ధూమపానం యొక్కనష్టాలను గురించి బాగా తెలిసి కూడా, దానిని మానివేయలేక ధూమపానం చేసేవారు. ఇందుకు ఉత్తమ ఉదాహరణ. సిగరెట్ మానుదామనుకున్నా తమకు తెలియకుండానే సిగరెట్ వెలిగించేసామని బాధపడుతూ ఉంటారు. రోడ్లపై ఇతరుల తప్పిదాలకు కొట్లాడేవారు (రోడ్డు రేజ్), లేదా నేరాల్లో పాల్గొన్న వారెవరైనా అది స్పృహతో కాకుండా క్షణికావేశంలో జరిగిందే కానీ ఉద్దేశ పూర్వకంగా కాదని ప్రమాణ పూర్వకంగా చెబుతారు. కార్యాలయంలో లేదా కుటుంబంలో కఠినమైన పదాలు మాట్లాడే వ్యక్తి విషయంలో కూడా అదే జరుగుతుంది. అవి ఉద్దేశించి అన్నవి కానందున తరువాత పశ్చాత్తాపపడతారు. ఇంద్రియాలు మనల్ని స్వాధీనం చేసుకుంటాయని, కర్మ బంధనంలో మనల్ని బంధిస్తాయని ఈ ఉదాహరణలు సూచిస్తున్నాయి.
చిన్నప్పుడు, మెదడులోని కణాలు (న్యూరాన్లు) నడక వంటి స్వయంచాలక కార్యకలాపాలను చూసుకోవడానికి హార్డ్ వైరింగ్ అని పిలువబడే కూటములను ఏర్పరుస్తాయి. ఎందుకంటే ఇది మెదడు యొక్క శక్తిని ఎంతో ఆదా చేస్తుంది. రోజువారీ జీవితంలో మనం సంపాదించిన నైపుణ్యాలు, అలవాట్ల విషయంలో కూడా అదే జరుగుతుంది. మనం ఈ ప్రక్రియలో చాలా శక్తిని వెచ్చిస్తాము. తద్వారా నిర్మితమైన హార్డ్ వైరింగ్ ఎంత శక్తివంతంగా మారుతుందంటే హావైరింగ్ వలన వచ్చిన అలవాట్లను అధిగమించడం చాలా కష్టం. కొత్తదాన్ని తయారు చేయడం తప్ప, ఉన్న హార్డ్ వైరింగ్ ను విచ్ఛిన్నం చేయడం అసాధ్యమని న్యూరో సైన్స్ చెబుతోంది.
ఇంద్రియాలు చాలా శక్తివంతమైనవి; అవి తెలివైన వ్యక్తి యొక్క మనస్సును కూడా బలవంతంగా హరించగలవని శ్రీకృష్ణుడు హెచ్చరిస్తున్నారు.
ఇంద్రియాల స్వయంచలనాన్ని అధిగమించడానికి సర్వశక్తి మంతుడైన పరమాత్మ ఎదుట ఆత్మసమర్పణ చేసుకోవాలని శ్రీకృష్ణుడు బోధిస్తున్నారు (2.61). ఇంద్రియాల గురించిన అవగాహనే వాటిని నియంత్రించడానికి అవసరమైన శక్తికిమూలము; ఇంద్రియాలతో పోరాడి వాటిని అదుపు చేయలేము.