“నిత్యజ్ఞానస్వరూప పరమానంద ప్రాప్తియందు స్థితప్రజ్ఞుడైన యోగి మేల్కొని యుండును. అది ఇతర ప్రాణులన్నింటికిని రాత్రితో సమానము. నశ్వరమైన ప్రాపంచిక సుఖప్రాప్తికై ప్రాకులాడుచు ప్రాణులన్నియు మేల్కొని యుండును. అది పరమాత్మతత్వము నెటిగిన మునికి (మననశీలునకు) రాత్రితో సమానము” అని శ్రీకృష్ణుడు చెప్పారు (2.69). ఈ శ్లోకం, శారీరకంగా మెలకువగా ఉంటూ, ఆధ్యాత్మిక రూపంగా నిద్రించడం; అలాగే నిద్రపోతూ కూడా ఆధ్యాత్మికంగా జాగృతిని పొందడం గురించి బోధిస్తుంది. దీని యొక్క అక్షరార్థ వివరణలు కూడా గమనించదగినవి.
జీవించడానికి రెండు పద్ధతులు ఉన్నాయి. ఒకటి, మనం మన సుఖాల కోసం ఇంద్రియాలపై ఆధారపడటం; మరొకటి మనం ఇంద్రియాల నుండి స్వతంత్రంగా ఉండి అవి మన నియంత్రణలో ఉండటం. మొదటి వర్గంలోని వారికి రెండవ జీవన విధానం తెలియని ప్రపంచం. మరి రాత్రి ఈ అజ్ఞానానికి రూపకం.
రెండవది, మనం ఒక ఇంద్రియ వరికరాన్ని ప్రయోగిస్తున్నప్పుడు మన దృష్టి మరెక్కడో ఉంటుంది. అంటే అది యాంత్రికంగా ఉపయోగించబడుతుందే తప్ప అవగాహనతో కాదు. ఉదాహరణకు, భోజనం చేసేటప్పుడు మన దృష్టి తరచుగా తినడం పై ఉండదు. మనం ఒకే సమయంలో అనేక పనులను చేయగలమని విశ్వసిస్తాము కనుక మనదృష్టి ఏదైనా తెర (స్క్రీన్), వార్తాపత్రిక లేదా ఫోన్ సంభాషణలో ఉండవచ్చు. అందుకే ఆధ్యాత్మికత అంటే మనం తినేటప్పుడు తినడము; మనం ప్రార్థిస్తున్నప్పుడు ప్రార్థించేంత సులభమని అంటారు. ఈ శ్లోకం వర్తమానంలో జీవించడమే పగలని; భూతకాలంలో, భవిష్యత్తులో జీవించడం అనేది అంధకార జీవనం అని సూచిస్తుంది.
మూడవది, తను నిద్రపోతున్నప్పుడు, తన పక్కనే నిద్రిస్తున్న బిడ్డ కోసం నిద్రిస్తున్న తల్లి ఒక యొక్క భాగం ఎల్లప్పుడూ మేల్కొని ఉన్నట్లుగా మనలో కొంత భాగం ఎప్పుడూ మేల్కొని ఉంటుంది; చాలా మంది శయనగృహంలో నిద్రిస్తున్నప్పుడు పేరు పిలిచిన వ్యక్తి లేచి నిలబడతాడు. మనలో కొంత భాగాన్ని ఎల్లవేళలా మెలకువగా ఉంచే సామర్ధ్యం మనందరికీ సమానంగా అందించబడిందని ఇవి సూచిస్తున్నాయి.
నిద్రావస్థలో కూడా సచేతనంగా ఉండే భాగాన్ని పెంపొందించు కోవాలని ఈ శ్లోకం ఉపదేశిస్తుంది. ఈ ప్రయత్నంలో మనం నిద్రపోతున్న విషయాన్ని కూడా మనం గమనించగలుగుతాము.