“సమస్త దిశలనుండి పొంగి ప్రవహించుచు వచ్చిచేరిన నదులన్నియును పరిపూర్ణమై నిశ్చలముగా నున్న సముద్రమును ఏమాత్రము చలింపజేయకుండగనే అందులో లీనమగును. అట్లే సమస్త భోగములును స్థితప్రజ్ఞుని యందు ఎట్టి వికారములను కల్గింపకయే వానిలో లీనమగును. అట్టి పురుషుడే పరమశాంతిని పొందును. భోగాసక్తుడు శాంతిని పొందజాలడు (2.70). కోరికలన్నింటిని త్యజించి, నిర్మమ, నిరహంకార, నిస్పృహ స్థితిలో చరించునట్టి పురుషుడే శాంతిని పొందును (2.71). ఇదియే బ్రహ్మప్రాప్తి కలిగిన పురుషుని స్థితి. ఈ బ్రాహ్మీస్థితిని పొందిన యోగి ఎన్నడును మోహితుడు కాడు. అంత్యకాలమునందును ఈ బ్రాహ్మీస్థితి యందు స్థిరముగానున్నవాడు బ్రహ్మానందమును పొందును” అని శ్రీకృష్ణుడు బోధిస్తున్నారు (2.72).
శ్రీకృష్ణుడు ఈ శాశ్వతమైన స్థితిని (మోక్షం) పోల్చడానికి సముద్రాన్ని ఉదాహరణగా ఇస్తారు. ఇంద్రియాల ద్వారా నిరంతరం పొందే ప్రేరణలు, ప్రలోభాలు, కోరికలు ప్రవేశించినప్పటికీ ఒక సముద్రం వలె, శాశ్వతమైన స్థితిని పొందిన మనుజుడు స్థిరంగా ఉంటాడు. రెండవది, నదులు సముద్రంలో కలిసినప్పుడు అవి తమ ఉనికిని కోల్పోతాయి. అదేవిధంగా, కోరికలు శాశ్వతమైన స్థితిని చేరుకొన్న ఒక వ్యక్తిలోకి ప్రవేశించినప్పుడు అవి తమ ఉనికిని కోల్పోతాయి.
మూడవది, ఏదైనా విషయం మనకు దుఃఖ దాయకంగా మారితే దానికి కారణం బాహ్య ప్రపంచము మనలో కలిగించే ఉద్రేకాలను మన నియంత్రించలేకపోవడమే. అందుకే, సముద్రం వలె మనం కూడా అటువంటి అస్థిరమైన, అనిత్యమైన ఉద్వేగాలను, ఉద్రేకాలను విస్మరించడం నేర్చుకోవాలి అని శ్రీ కృష్ణుడు చెబుతున్నాడు (2.14).
మనకు ఉన్న అవగాహన ప్రకారం, ప్రతి కర్మకు కర్త, కర్మఫలం ఉంటాయని అనుకుంటాము. అంతకుముందు, శ్రీకృష్ణుడు (2.47) మనకు కర్మను, కర్మఫలాలను వేరు చేసే మార్గాన్ని అందించారు. ఇప్పుడు ఆయన కర్త, కర్మలను వేరు చేయడానికి అహంకారం, కర్తృత్వ భావాలను వదిలివేయమని సలహా ఇస్తున్నారు. ఈ శాశ్వతమైన శాంతి స్థితిని చేరుకొన్న తర్వాత తిరిగి వచ్చే ప్రసక్తే లేదు. అప్పుడు ఏ కర్మ అయినా ఈ బ్రహ్మాండము యొక్క కోటాను కోట్ల చర్యలలో ఒకటిగా మిగిలిపోతుంది.
భగవద్గీతలో సాంఖ్యయోగం (రెండవ అధ్యాయం) ద్వారా విషాదం (ప్రథమ అధ్యాయం) తర్వాత శాశ్వతమైన స్థితి వస్తుంది. ఎందుకంటే ఇది ప్రకృతి యొక్క నియమం. శ్రీకృష్ణుడు అర్జునుడి విషయంలో చేసినట్లుగా విషాదమును కూడా సానుకూలంగా ఉపయోగించినప్పుడు దానికి మోక్షాన్ని తీసుకురాగల సామర్థ్యం ఉంటుంది.