భగవద్గీతలోని మూడవ అధ్యాయం 'కర్మ యోగము' మని పిలువబడుతుంది. ఇది 2.71 శ్లోకం యొక్క విశదీకరణ. ఇక్కడ శ్రీకృష్ణుడు శాశ్వతమైన స్థితిని సాధించడానికి నిర్-మమ, నిర్-అహంకారం మార్గమని చెప్పారు.
“మీరు బుద్ధిని ఉన్నతమైనదిగా భావిస్తే, నన్ను ఈ భయంకర కార్యమైన యుద్ధంలో ఎందుకు నిమగ్నం చేస్తారు (3.1) ? ప్రసంగంతో నన్ను కలవరపెట్టకుండా నా క్షేమం కోసం అన్నిటికంటే ఏది మంచిదో నాకు నిశ్చయంగా చెప్పండి” అని అర్జునుడు సందేహాన్ని లేవనెత్తుతాడు (3.2).
భావోద్వేగానికి లోనై సరైన సాక్ష్యాధారాలు లేకుండా నిర్ణయాలు తీసుకోవడం, నిర్ధారణలకు రావడం, అంచనాలు వేయడం వదిలి వేయమని (2.50) శ్రీకృష్ణుడు అంతకు ముందే సూచించారు. యుద్ధంలో తన బంధువులను చంపడం (1.31) వలన ఏ మంచీ జరగదనే కారణంతో అర్జునుడు యుద్ధం నుండి తప్పించుకొనాలని నిర్ణయించుకొన్నారు. తదనంతరం, అతను తన నిర్ణయాన్ని సమర్థించు కోవడానికి అనేక ఔచిత్యాలను ముందుకు తెస్తాడు. ప్రస్తుత ప్రశ్న కూడా అవగాహన కోసం అన్వేషణ కాకుండా స్వీయ సమర్ధనలో భాగంగా కనిపిస్తుంది.
మన పరిస్థితి అర్జునుడి కంటే భిన్నంగా లేదు. ఎందుకంటే మనం మన స్పృహలోకి రాకముందే మతం, జాతి, కుటుంబ స్థితి, కులం, జాతీయత, లింగం మొదలైన వాటి ఆధారంగా గుర్తించ బడతాము; జీవితాంతం వాటిని సమర్థించుకోవడానికి పోరాడుతూనే ఉంటాము.
రెండవది, అర్జునుడు శ్రీకృష్ణుడి నుండి నిశ్చయత కోసం వెతుకుతున్నాడు. అశాశ్వతం, అనిశ్చయత అనేవి లోక రీతుల ప్రమాణం అయినప్పటికీ మనమందరం మనకు హాయినిచ్చే నిశ్చయత కోసం చూస్తాము. హేతుబద్ధమైన నిర్ణయాల కోసం మరిన్ని సాక్ష్యాలను సేకరించేందుకు అనిశ్చయతతో వేచి ఉండడానికి ధైర్యం, ఓర్పు కావాలి.
కానీ శాశ్వతమైన నిశ్చితత్వ అనేది తన స్వంత జీవిత అనుభవాల నుండి వస్తుంది, ఈ అనుభవాన్ని పుస్తకాల నుండి లేదా ఇతరుల నుండి అరువు తెచ్చుకోలేము కాబట్టి మనమందరం కష్టపడి సంపాదించాలి. ఇది డ్రైవింగ్ లేదా సైక్లింగ్ వంటిది; ఇది ప్రతి ఒక్కరికీ తన స్వంత అనుభవం.