“నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా, ఈ ప్రపంచంలో మోక్షానికి రెండు మార్గాలు ఉన్నాయి - జ్ఞానులు జ్ఞానం ద్వారా, యోగులు కర్మ మార్గం ద్వారా మోక్షాన్ని పొందుతారు” అని శ్రీకృష్ణుడు సమాధానము ఇస్తారు (3.3). ఈ శ్లోకం బుద్ధి ఆధారితమైన వారికి అవగాహన మార్గం, మనస్సు ఆధారితమైన వారికి కర్మ మార్గమని సూచిస్తుంది.
ఈ విషయాన్ని మరింత వివరిస్తూ శ్రీకృష్ణుడు, “కేవలం కర్మలను ఆచరించకుండా, ఎవ్వరు నైష్కర్మ్యం పొందలేరు; కేవలం కర్మలను త్యజించడం ద్వారా సిద్ధిని పొందలేరు” అని స్పష్టం చేశారు (3.4). సాధారణ వ్యక్తి చేయలేని పనిని త్యాగం చేసేవారు చేస్తారు కాబట్టి దాదాపు అన్ని సంస్కృతులలో పరిత్యాగం కీర్తించబడుతుంది. అందుకే అర్జునుడు రాజ్యం యొక్క విలాసాన్ని, యుద్ధం యొక్క బాధను
త్యజించాలనుకున్నప్పుడు అతని దృక్పథం మనలో చాలా మందిని ఆకర్షిస్తుంది.
శ్రీకృష్ణుడు కూడా త్యజించడాన్ని ఇష్టపడతారు అయితే మన కర్మలు అన్నింటిలో 'నేను' అనే భావనను త్యాగం చేయమని చెబుతారు. శ్రీకృష్ణునికి నిర్మమ, నిరహంకార శాశ్వత స్థితికి మార్గాలు (2.71). శ్రీకృష్ణుడికి యుద్ధం సమస్య కాదు; అర్జునుడిలోని 'నేను' అనేదే సమస్య.
మన రోజువారీ జీవితంలో డబ్బు, ఆహారం, ఆస్తులు, అధికారం లాంటి వాటిని త్యజించవచ్చు. 'నేను డబ్బు సంపాదించాను; ఇప్పుడు డబ్బును దానం చేస్తున్నాను' అనే స్థితిలో 'నేను' అనే అహంకారం ఉన్నంత వరకు డబ్బు సంపాదించడం, దానం చేయడం అనేవి ఆధ్యాత్మిక దృష్టిలో ఒకటే.
భౌతిక ఆస్తులను త్యజించడాన్ని మనం సాధారణంగా పొగుడుతాము కాబట్టి సంపాదన, త్యజించడం అనేవి ఒకటే అనే విషయాన్ని సంగ్రహించడం కష్టమైన విషయము. కీర్తి, పేరు, ప్రతిష్ట, పుణ్యం వంటి అధిక లాభాల కోసం ఇలా త్యజించే అవకాశంను ఉంది. అందుకే శ్రీకృష్ణుడు మనల్ని అక్కడితో ఆగిపోకుండా 'నేను' త్యజించే చివరి దశకు చేరుకోమని కోరతారు.
'నేను' అనే భావన తొలగిపోయినప్పుడు ప్రతి విషయము, ప్రతి పరిస్థితి ఒక ఆనందకరమైన నాటకం అవుతుంది. లేకపోతే జీవితం అనే ఈ నాటకం కూడా విషాదంగా మారుతుంది.