“నాకు కర్మ ఫలాసక్తి లేదు. కావున కర్మలు నన్ను అంటవు. ఈ విధముగా నా తత్వమును తెలిసినవారు కర్మ బద్దులు కారు” అని శ్రీకృష్ణుడు చెప్పారు (4.14). 'కర్మలపై మనకు హక్కు ఉంది కానీ కర్మఫలంపై కాదు' అనే శ్రీకృష్ణుడి బోధనలను (2.47) ఇది గుర్తు చేస్తుంది. పరమాత్మగా ఆయన కూడా అదే మార్గాన్ని అనుసరిస్తారు. తాను మానవులలో వివిధ విభజనలను సృష్టించినప్పటికీ, తనకు కర్తృత్వం లేకపోవడాన్ని శ్రీకృష్ణుడు సూచించారు (4.13).
"అర్జునా! ప్రాచీనుడైన ముముక్షువులు ఈ విధముగా నా తత్వ రహస్యమును తెలుసుకొని కర్మల నాచరించిరి. కావున నీవును ఆ పూర్వుల వలెనే నిష్కామ భావంతో కర్మల నాచరింపుము” అని శ్రీకృష్ణుడు వివరించారు (4.15).
మన జీవితపు సాధారణ గమనంలో కర్మఫలాన్ని పొందేందుకే మనం కర్మలు చేస్తాము. అయితే కర్మఫలాన్ని వదులుకోమని చెప్పినప్పుడు మనం కర్మలను కూడా వదులుకుంటాము. శ్రీకృష్ణుడు ఇక్కడ పరిత్యాగానికి పూర్తిగా భిన్నమైన అర్ధాన్ని మార్గాన్ని వెల్లడించారు. కర్మఫలం, కర్తృత్వం రెండింటితో అనుబంధాన్ని వదిలివేసి మనల్ని కర్మలు చేస్తూనే ఉండమని సలహా ఇచ్చారు. ఒక కర్మ మాత్రమే అయిన యుద్ధాన్ని చేయమని అర్జునుడికి ఆయన ఇచ్చిన సలహాను ఈ నేపథ్యం అర్థం చేసుకోవాలి.
మన కర్మలలో కర్తృత్వాన్ని వదిలివేయడం అంత తేలికైన విషయము కాదు. కానీ నాట్యం, చిత్రలేఖనం, చదవడం, టీచింగ్, తోటపని, వంట, క్రీడలు మరియు శస్త్రచికిత్స వంటి కార్యకలాపాలలో లోతుగా నిమగ్నమైనప్పుడు మనమందరం తరచుగా 'కర్తృత్వం' లేకుండా వ్యవహరిస్తాము. ఈ మానసిక స్థితిని ఆధునిక మనస్తత్వశాస్త్రంలో 'ప్రవాహ' (flow) స్థితి అంటారు. మన ప్రయత్నాలకు విశ్వం ప్రతిధ్వనిస్తుందని గ్రహించి కర్తృత్వం లేకుండా జీవించిన అందమైన క్షణాలను గుర్తించి వాటిని జీవితంలో విస్తరించడమే దీని సారాంశము.
జీవితము స్వతహాగా ఆనందమయమైనది, అద్భుతమైనది. దీనికి కర్తృత్వం లేదా కర్మఫలం యొక్క సహాయం అవసరం లేదు. మనం కర్తృత్వం, కర్మఫలం రెండింటినీ విడిచి పెట్టినప్పుడు పరమాత్మతో ఐక్యమైపోతాము. మనం మన కర్మ బంధాల నుండి విముక్తిని పొందుతాము.