'చేసిన పనిని విస్మరించిన పని' (Act of commission and omission) అనేది న్యాయ శబ్దావళిలో సాధారణంగా ఉపయోగించే పదబంధం. డ్రైవర్ సరైన సమయంలో బ్రేకులు వేయడంలో విఫలమవడం వల్ల అది దుర్ఘటనకు దారితీస్తుంది. ఈ 'విస్మరించటం' లేదా అకర్మ (క్రియ చేయకపోవడం) దుర్ఘటన అనే కర్మకి దారి తీస్తుంది.
ఉదాహరణకు, ఏదైనా చర్య చేస్తున్నప్పుడు మనకు అందుబాటులో ఉన్న అనేక విభిన్న సాధ్య-అసాధ్యాల నుండి మనం ఒకదాన్ని ఎంచుకుంటాము. మనం ఈ సంభావనలలో ఒకదానిని అమలు చేసినప్పుడు మిగిలిన అన్ని సంభావనలు మనకు అకర్మగా మారతాయి. ప్రతి కర్మలోనూ అకర్మ దాగి ఉంది అనే నిర్ధారణకు ఇది దారి తీస్తుంది.
“కర్మయందు అకర్మను, అకర్మలో కర్మను దర్శించువాడు మానవులలో బుద్ధిశాలి. అతడు యోగి, సమస్త కర్మలు చేయువాడు (4.18)” అనే కృష్ణుడి క్లిష్టమైన బోధనను అర్థం చేసుకోవడానికి ఈ ఉదాహరణలు మనకు సహాయపడతాయి.
"కర్మ అనగానేమి అకర్మ అనగానేమి ఈ విషయమును నిర్ణయించుటలో విద్వాంసులు సైతం భ్రాంతికి లోనగుచున్నారు; తికమక పడుచున్నారు” కనుక ఈ విషయం క్లిష్టమైనది అని శ్రీకృష్ణుడు హెచ్చరిస్తున్నారు (4.16). "కర్మ తత్వమును తెలుసుకొనవలెను. అట్లే అకర్మ స్వరూపమును కూడా ఎరుగవలెను. వికర్మ లక్షణములను కూడా తెలిసికొనుట చాలా అవసరము. ఏలనన, కర్మతత్వము అతి నిగూఢమైనది” అని చెప్పారు (4.17).
ఒక చింతనగల వ్యక్తి ఒకసారి ఒక జంతువు అడవిలోకి పారిపోవడాన్ని గమనించాడు. క్షణకాలం తర్వాత ఒక కసాయి వచ్చి, మీరు జంతువును చూశారా అని అడిగాడు. అబద్దం చెప్పడం అనైతికమయితే నిజం జంతువు మరణానికి దారి తీస్తుంది కాబట్టి వ్యక్తి సందిగ్ధంలో పడిపోతాడు. అన్ని సంస్కృతులు, మతాల యొక్క నిషేధించబడిన చర్యలన్నింటినీ మనం సంగ్రహిస్తే, జీవించడం అసాధ్యం. అందువల్ల ఈ సమస్యలు జటిలమైనవని; వీటివల్ల విద్వాంసులు కూడా గందరగోళానికి గురవుతారని శ్రీకృష్ణుడు సూచించారు.
మనమందరం నివసించే భౌతిక ప్రపంచంలో జీవితం మనకు సులభమైన సమాధానాలు లేని అనేక 'ముందు నుయ్యి, వెనుక గొయ్యి' లాంటి పరిస్థితులను సృష్టిస్తుంది. మనం కర్త నుండి సాక్షి దాకా పయనించి ఎంపికలేని అవగాహనతో జీవించినప్పుడు మాత్రమే స్పష్టత వస్తుంది.