Kathalu. Kaburlu. S02 Chapter 12.
పొన్నియిన్ సెల్వన్ ప్రమోషన్స్ ఓ విధంగా త్రివేణి సంగమం అని చెప్పవచ్చేమో ! ఓ పక్క మణి రత్నం తీసిన సినిమా విడుదల విడుదల కాబోతుంది, మరో పక్క దాసుభాషితంలో ఉన్న పొన్నియిన్ సెల్వన్ శ్రవణ పుస్తకానికి కూడా మంచి ఆధరణ లభిస్తోంది, ఇదే సమయం లో పొన్నియిన్ సెల్వన్ తెలుగు, తమిళ పుస్తకాలపై కూడా అంతర్జాలంలో మంచి చర్చలు నడుస్తున్నాయి. ఈ విధంగా రచన, శ్రవణం, సినిమా ఈ మూడు మాధ్యమాలు మూడు నదులుగా త్రివేణి సంగమం లా సాగి అనంత సాగరమైన మీ వంటి ప్రేక్షకులతో కలిసిపోతున్నాయి. ఇలాంటి సంధర్భాలు పుష్కర కాలానికి కానీ రావు. అందుకే పోయిన శనివారం నాడు పొన్నియిన్ సెల్వన్ నవల తెలుగు అనువాదకులు నాగరాజన్ కృష్ణమూర్తి గారితో దాసుభాషితం ప్రత్యేక లైవ్ ఈవెంట్ ని నిర్వహించింది. " అసలు ఈ నవలకు బీజం ఎక్కడ పడింది ? " అని నాకు ఎప్పటి నుంచో ఉన్న ప్రశ్నను నేను నాగరాజన్ కృష్ణమూర్తి గారిని అడిగాను. అందుకు ఆయన తిరువాలంకాడు అనే ఒక ఊరిలో త్రవ్వకాల్లో బయటపడిన ఒక తామ్ర పత్రం లో ఉన్న రెండు లైన్లతో ఆ నవలకు బీజం పడింది అని ఒక ఆసక్తికర విషయం పంచుకున్నారు. అంతే కాదు కల్కి కృష్ణమూర్తిగారు వారి పేరులో సగం, వారి భార్య పేరులో సగం తీసుకుని కల్కి అని కలం పేరును పెట్టుకోవడం, కల్కి అనే వార పత్రికను కూడా స్థాపించడం గురించి చెప్పారు. ఇంకా ఇలాంటి ఆసక్తికర విషయాల చూడటానికి క్రింద యూట్యూబ్ లింక్ లో నాగరాజన్ కృష్ణమూర్తిగారితో జరిగిన పూర్తి లైవ్ రికార్డింగ్ సెషన్ చూడవచ్చు.
https://www.youtube.com/live/Y-PE3NaQlxM