Listen

Description

Kathalu. Kaburlu. S02 Chapter 19.

మా మీటింగ్ లలో సంస్థ గురించి, మా పనుల గురించి మాట్లాడేసుకున్నాకా, నాకు, ప్రభ గారికి, రాం కి ఉండే వ్యక్తిగత, ఆధ్యాత్మిక ప్రశ్నలు కిరణ్ గారిని అడగడం మాకు అలవాటు. అందుకే మా మీటింగ్ లు రెండేసి గంటలు, రెండున్నరేసి గంటలు సాగుతుంటాయి. అలా నా వ్యక్తిగత ప్రశ్నకు సమాధానంగా ఒకసారి కిరణ్ గారు నాకు ఒక మంచి సలహా ఇచ్చారు.

ఏవరికైనా సమాధానం ఇచ్చేముందు, కొంతసేపు వదిలేయ్. దాని గురించి నీ మనసులో అంతర్మధనం జరుగుతుంది, ఫరవాలేదు. జరగనియ్. కానీ ఆవేశంలోనో, ఉత్సాహంలోనో మాట్లాడటమో, రాయడమో చేయడం మరింత ప్రమాదకరం' అన్నారు. Come backs కి బాగా అలవాటు పడిన నేను 'మరి అవతలి వాళ్ళు మనల్ని చేతగాని వాళ్ళుగా లెక్కేస్తారు కదండీ' అన్నాను. దానికి ఆయన ఇచ్చిన సమాధానం నేను ఒక పుస్తకం లో రాసుకుని ఎర్ర ఇంకుతో అండర్ లైన్ చేసుకున్నాను.

'అనుకుంటే ఏమైవుతుంది? నువ్వు నిజంగా చేతగానిదానివి అయిపోతావా? నిజానికి నువ్వు వెంటనే చెప్పే సమాధానంలో ఆవేశం తప్ప ఏమీ ఉండదు. పైగా అలా మాట్లాడినప్పుడు అవాకులు, చవాకులు వచ్చే అవకాశం ఉంది. అదే నువ్వు కొంతసేపు ఆగి, మాటలన్నీ కూర్చుకుని, పరమ ప్రశాంతంగా, గంభీరత చెడకుండా ఇచ్చే సమాధానం విలువ కొన్ని వందల రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఆ మాటల్లోని క్లుప్తత ఎదుటివారిని హెచ్చరిస్తుంది.' అని చెప్పారు.

రెండు వారాల క్రితం దాసు కిరణ్ గారు కుందేలు సహాయంతో మనలోని ఆదిమధ్యాంతరాహిత్యాన్ని అనుభవైకవైద్యం చేయించే ప్రయత్నం చేసినప్పుడు మన కూటమిలో కొంత అలజడి రేగింది. ఆ కామెంట్ పెట్టినవారికి నేను నాకు తట్టిన సమాధానం చెప్దాం అనుకున్నా. నిజానికి కిరణ్ గారి అర్హతను ప్రశ్నించిన భావన వచ్చింది. ఆవేశంగా ఏదో టైప్ చేసేశా. కానీ కిరణ్ గారి సలహా గుర్తుకు తెచ్చుకుని, ఆ రాత్రికి నా సమాధానాన్ని నానబెట్టాను.

తరువాతి రోజు కిరణ్ గారు ఆ కామెంట్ కు స్పందించిన తీరు చాలా విచిత్రంగా తోచింది. నిజానికి ఆ కామెంట్ చేసినవారు చాలా సద్విమర్శ చేశారు. కానీ నేను అంత దూరం ఆలోచించలేకపోయాను. అయితే, నేను చేసిన మంచి పని ఏమిటంటే నా ప్రతిస్పందనను వాయిదా వేయడం. ఫలితం, కిరణ్ గారి నుంచి ఎంతో మంచి ప్రతిస్పందన. నేను ఆయన సలహా పాటించాను కాబట్టి, ఇప్పుడు నాకు తోచిన సలహా ఆయనకు ఇవ్వడం నా కర్తవ్యం అనిపించింది.

ఆ వారం జరిగిన మా సమావేశంలో నేను కిరణ్ గారికి ఒక సలహా లాంటిది ఇచ్చాను. 'సర్, ఈ ఆధ్యాత్మిక విషయాలు చెప్పడానికి మీ దగ్గర ఎంత అనుభవం ఉన్నా, ఎన్ని పద్ధతులు ఉన్నా, వినేవాళ్ళకు మీ అర్హత ఏమిటి అన్నది తెలిస్తే, మీరు చెప్పేవాటికి విలువ వస్తుంది అని నా అభిప్రాయం. కాబట్టీ, మీ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని విశదంగా వీక్షకులతో పంచుకుంటే బాగుంటుంది, వచ్చే వీడియో వేరే ఏ విషయంపైనా కాకుండా, మీ జర్నీపై చేయచ్చు కదా' అని అడిగాను.

దానికి ఆయన నవ్వేస్తూ, 'సరిగ్గా ఇప్పుడే ఆ వీడియో రికార్డ్ చేసి, మీటింగ్ లోకి వచ్చాను' అన్నారు. అదే ఈ వీడియో. తన ఆధ్యాత్మిక ప్రయాణం గురించి మా టీంతో కిరణ్ గారు ఎన్నో పంచుకున్నా, ఇంత లోతుగా మాకు కూడా వారి జర్నీ తెలియదు. ఆ వీడియో చూసి, ఆశ్చర్యపోవడం మా వంతు అయింది. నిజానికి వారి ప్రయాణం లో ఈ వీడియో ఇంటర్వెల్ వరకూ మాత్రమే ఉంది. మిగిలినది త్వరలో రాబోతోంది. కిరణ్ గారి ఆధ్యాత్మిక వీడియోల వెనుక ఇన్నేళ్ళ తపస్సు ఉందా అనిపించే వారి ప్రయాణాన్ని చూడండి.

---

Thought Experiment Video : https://youtu.be/HK5pparBdi8

---
మరిన్ని కథలు కబుర్లు వినడానికి ఈ లింకు నొక్కి దాసుభాషితం యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.

https://www.dasubhashitam.com/ab-title/pc-kathalu-kaburlu-2