మన వసుధలో ఎన్నో ఖనిజాలు, లవణాలు, ఇంధనాలు, రత్నాలు, వాయువులు ఉన్నట్టే, తనలో ఎన్నో శాస్త్రాలను ఇముడ్చుకున్నారు ప్రముఖ శాస్త్రవేత్త, శాస్త్రీయ, సాంకేతిక రచయిత శ్రీ వేమూరి వేంకటేశ్వరరావు గారు.
వీరు Quora లో గణితానికి, విజ్ఞానశాస్త్రానికి సంబంధించిన ఎన్నో సందేహాలకు సమాధానాలు ఇస్తున్నారు. సాధారణంగా ఒక మనిషికి తాను చిన్నప్పటి నుంచి నేర్చుకున్న భాషలో, తనచుట్టూ ఉన్న వ్యక్తులు, వస్తువులతో పోల్చుతూ విషయాలు చెబితే, అవి కఠినమైన శాస్త్రీ య విషయాలైనా సులువుగా అర్థం అవుతాయి. రావు గారు చేసేది అదే. నిత్యం వాడుతున్న వాటి గురించిన పూర్తి అవగాహన ఉండని అనేకులకు ‘ఓస్ ఇంతేనా’ అనిపించేలా వారి సమాధానాలు ఉంటాయి.
రావు గారు విశాఖ జిల్లా, చోడవరం లో వేమూరి సోమేశ్వరరావు, తెన్నేటి సీతమ్మ దంపతులకు జన్మించారు. వారు తమ ఇంజినీరింగ్ విద్యను భారతదేశంలోనూ, ఎం.ఎస్ , Ph D లను అమెరికాలో పూర్తి చేశారు. భారతదేశంలో నైవేలీ లిగ్నయిట్ ప్రోజెక్ట్, భిలాయ్ స్టీల్ ప్రోజెక్ట్‌లలో ఉద్యోగాలు చేశారు. ఆపైన యూనివర్సిటీ ఆఫ్ కేలిఫోర్నియాలో, కంప్యూటర్ సైన్సు విభాగంలో, ఆచార్య పదవిలో పనిచేశారు. తెలుగు విజ్ఞానశాస్త్ర రచయితగా, నిఘంటు నిర్మాతగా పేరొందారు.
రావు గారు ఆధునిక విజ్ఞానశాస్త్రాన్ని జనరంజక శైలిలో రాయటంలో సిద్ధహస్తులు. వీరు 1967 ప్రాంతాలలో కంప్యూటర్ల మీద మొట్టమొదటి తెలుగు పుస్తకం రాశారు. ఇది తెలుగుభాషా పత్రికలో రెండున్నర ఏళ్ళ పాటు ధారావాహికగా ప్రచురించబడింది. ఇంతటి విజ్ఞానసమ్రాట్టుకి అవార్డులు చేరువకాకుండా ఉంటాయా? జీవిత సాఫల్య అవార్డులు, తానా వారి అచీవ్‌మెంట్ అవార్డు ఇంకా మరెన్నో వీరిని వరించాయి.
వీరు 10 సంవత్సరాలపాటు ఎకో ఫౌండేషన్ అనే స్వచ్చంద సంస్థని స్థాపించి, నడిపారు. పర్యావరణ పారిశుద్ధ్యం, గ్రామీణ సంక్షేమం, బీద విద్యార్ధులకి భత్యం కల్పించటం, విద్యారంగంలో ప్రతిభావంతులకి పురస్కారాలు, తెలుగు భాషని పునరుద్ధరించటానికి ప్రయత్నాలు ఈ సంస్థ ఆశయాలు.
దాసుభాషితంలోని 'జీవనం' లెసన్స్ సిరీస్ లో భాగంగా Quora సౌజన్యంతో వేమూరి రావు గారి వ్యాసాల్లో ఎంపిక చేసిన 15 అధ్యాయాలను "శాస్త్రంతో దోస్తీ" అనే శీర్షికన శ్రవణ రూపంలో ఇంతకు ముందు విడుదల చేశాము. ఇపుడు మన జీవితంలో తెలియకుండనే ఎంతో భాగమైపోయిన కంప్యూటర్లపై, ఇంటర్నెట్ ల గురించి మనకు ఉండే సందేహాలను చాలా సరళమైన భాషలో మన చుట్టూ ఉన్న వస్తువులతో ఉదహరించి, వివరించిన రావు గారి మరికొన్ని వ్యాసాలను అదే శీర్షికలో శ్రవణ రూపంలో అందిస్తున్నాము.
అవి ఇక్కడ వినండి.
https://www.dasubhashitam.com/ab-title/pc-sastram-tho-dosthi-2