Kathalu. Kaburlu S03E07
మా అమ్మా, నాన్నగార్లు గొడవ పడ్డారు అంటే, నేను పోస్ట్ మ్యాన్ అవతారం ఎత్తాల్సిందే. 'మీ నాన్నగార్ని భోజనానికి రమ్మనవే', 'నాకు ఆకలిగా లేదు నేను తినను అని చెప్పు, ఎంత గొడవ జరిగినా అన్నం తినడానికి నేను మీ అమ్మని కాదు', 'కోపం పెళ్ళాం మీదైతే అన్నం ఏం చేసింది? అన్నాన్ని వద్దనకూడదు అని కూడా తెలీదు కానీ, నా మీద ఎగరడానికి మాత్రం తయారు. అన్నాన్ని వద్దు అంటే తిరిగి అన్నం పుడుతుందా'. ఇదీ వరస. మధ్యలో నన్ను పెట్టుకుని వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడేసుకునేవారు.
నిజానికి ఈ గొడవలు ఏడాదిలో ఒక్కసారో రెండుసార్లో అంతే. అదీనూ మా చదువులకు అయ్యే ఖర్చులు లాంటి విషయాలే తప్ప పెద్ద గొడవలేం ఉండేవి కావు. కోపం వస్తే మాత్రం ఒకళ్ళని మించి ఒకళ్ళు బెట్టుగా ఉండేవారు. ఒక వారం రోజులు పైన ఉదహరించిన డైలాగులు ఒకరిపై ఒకరు విసురుకుంటూ గడిపేసేవారు. అయితే, మా నాన్నగారి దగ్గర ఉన్న ఒక చెడ్డ లక్షణం ఏమిటంటే, ఆయన 'సారీ' లూ గట్రా చెప్పేవారు కాదు. వాళ్ళ మధ్య యుద్ధం ముగిసి, సంధి జరిగింది అనడానికి గుర్తు ఏమిటంటే, కరచాలనం. ఒక్క హ్యాండ్ షేక్ లో క్షమించమని అడగడాలూ, క్షమించేయడాలు అన్నీ జరిగిపోయేవి.
నాకు అది నచ్చేది కాదు. అంతటి ధర్మయుద్ధానికి ముగింపు ఒక్క షేక్ హ్యాండేనా అని నాకు చాలా అసంతృప్తిగా ఉండేది. మా నాన్నగారిలో నాకు అస్సలు నచ్చని లక్షణాలన్నిటినీ పోగేసుకుని మా ఆయన ప్రత్యక్షమయ్యారు. మా సార్ డిక్షనరీలో కూడా సారీ లు, థాంక్స్ లు ఉండవు. మేము తనివితీరా దెబ్బలాడుకున్న తరువాత, మళ్ళీ మామూలు అవ్వడానికి దారి మా దేవుడు ప్రసాదించే చిరునవ్వు. 'సరిసర్లే ఎన్నో అనుకుంటాం.. ఇంక వదిలేయ్' అన్నట్టు ఉంటుంది ఆ నవ్వు. 7 ఏళ్ళ దాంపత్యంలో మా సార్వాడు సారీ చెప్పిన క్షణం ఒక్కటంటే ఒక్కటీ లేదు.
మా అమ్మానాన్నగార్లు ఒక్క మాట ఎక్కువా కాకుండా, ఒక్క మాట తక్కువా కాకుండా తూకంగా మాట్లాడుకుంటారు. వాళ్ళిద్దరూ ఏదో రెండు దేశాల అధినేతల్లా హుందాగా ఉంటారు. మా రూటే సెపరేటు. మేము సాధ్యమైనంత వరకూ స్నేహంగా ఉంటాం(అఫ్ కోర్స్ కండీషన్స్ అప్లై. ఒకరి పుట్టింటివైపు వాళ్ళని మరొకళ్ళు ఏమీ అననంత వరకే ఆ స్నేహం). మొదట్లో దెప్పిపొడుపులు, వెటకారాలూ, వెక్కిరింతలన్నిటికీ నానార్ధాలు వెతుక్కుని అవస్థలు పడ్డాం కానీ, పోగా పోగా అన్నీ చనువు కొద్దీ వచ్చే నోటి దురద మాటలే అని అర్ధమవుతోంది. దాంపత్యంలో ఇంకా మొదటి అంకంలోనే ఉన్న మేము ముందు ముందు unlock అయ్యే levels కోసం కాస్త భయంగా, చాలా భరోసాగా ఎదురుచూస్తున్నాం.
నాకు అర్ధమైనంతలో అసలు దాంపత్యం అంటే ఏమిటో వివరిస్తూ, ఈ వారపు న్యూస్ లెటర్ రాశాను. అనవసరంగా మీ partner పుట్టింటి వైపు వారిపై మీ మనసులో ఉన్న భావాలు, వారి ఎదురుగుండా బయటపడే ప్రమాదం నుండి మిమ్మల్ని మీరు తప్పించుకోవాలంటే ఈ కింది లింకుల్లో ఉన్న న్యూస్ లెటర్ని చదివేసి, వినేయండి. నాకు తెలుసు మీరు చదువుతారు, ఎందుకంటే partner పై ప్రేమ/భయం ఉన్నవారు మీనా శాపాల బారిన ఎందుకు పడతారు.
Blog : https://www.dasubhashitam.com/blog/pellante-noorellaa
Podcast: https://www.dasubhashitam.com/ab-title/pc-kathalu-kaburlu-3
🙏🏻
#కథలు_కబుర్లు
మీనా యోగీశ్వర్ । 13-03-2024