Kathalu.Kburlu S03E08
మా బామ్మగారి అత్తగారు, మా తాతయ్య గారి చిన్నప్పుడే చనిపోయారు. ఆయన పెరిగింది అంతా వాళ్ళ బామ్మ చేతిలో. మా బామ్మ పెళ్ళయ్యే నాటికి తన అత్తగారి అత్తగారిదే ఇంటి పెత్తనం. ఆవిడకి విపరీతమైన మడి, ఆచారం. 'నిప్పులు కడిగి, వంట చేయడం' అనేది మనలో చాలామంది ఏదో సామెతగా విని ఉంటాం. కానీ, ఆవిడకి అది నిత్యకృత్యం. 'ఆ బొగ్గులు దేనితో తయారు చేశారో', 'అవి ఎండేటప్పుడు ఏ జంతువు ముట్టుకుందో', 'ఎవరి చేతిలో ఎండి మన దగ్గరకు వచ్చాయో', ఇవి ఆవిడ రోజూ బొగ్గులు కడుగుతూ చెప్పే కామన్ డైలాగులు.
నీళ్ళకోసం చెరువుకు వెళ్తే, బిందెడు నీళ్ళతో మొదలైన ఆవిడ, ఇంటికి వచ్చేసరికి రెండు చెంబుల నీళ్ళు మిగిలేవిట. దారంతా చల్లుకుంటూ, ఆ నీళ్ళపై నడుస్తూ ఇంటికి రావడం మా ఊర్లో ఇప్పటికీ కథలు కథలుగా చెప్పుకుంటారు.
ఒకసారి మా కంచుమర్రు ఊరివాళ్ళు చాలామంది కలిసి కాశీ యాత్ర చేయడానికి బయలుదేరారు. పూర్వ సువాసిని, అందులోనూ విపరీతమైన ఆచారం. అక్కడక్కడా నడక, అక్కడక్కడా రైలు ప్రయాణం. అన్నం అంటు, వేరే వాళ్ళని ముట్టుకోవాలంటే మడి. ఇలా ఏదో గడుపుకుంటూ ప్రయాణం సాగిస్తున్నారు ఆవిడ. వారి మజిలీ పూరీ క్షేత్రం చేరింది. మా ఇంట్లో ఇత్తడి గిన్నెల్లో వంట, విస్తరాకులు, వెండి కంచాల్లో భోజనం. మా వాళ్ళకి మట్టికుండ మడికి పనికిరాదు. అందులో వండినవి ఈవిడ తినేవారు కాదు.
పూరీలో మరి కుండల్లోనే ప్రసాదం వండి, నైవేద్యం పెట్టి, భక్తులకు కుండల పళంగా అమ్ముతారు కదా. ఈవిడ దగ్గరకి ఆ కుండ ప్రసాదం వచ్చింది. అంతే, ఈవిడ చిందులు మొదలుపెట్టింది. ఆట్.. కుండలో వండినది నేనెలా తింటాను? ఆదో ప్రసాదమా? అసలు దేవుడికి ఎలా పెడుతున్నారు? అని రంకెలు మొదలుపెట్టి, ప్రసాదం తినకుండానే బసకు వెళ్ళిపోయారట.
సాయంత్రానికి ఆవిడ గొంతు, మెడ పూర్తిగా వాచిపోయి, నొప్పి మొదలైందిట. అంతే చుట్టుపక్కలవారందరూ చెంపలు వాయించుకోవడం మొదలుపెట్టారట. అదుగో, మీరు స్వామి వారి ప్రసాదాన్ని తినకపోవడమే కాదు, హేళన చేశారు, అవమానించారు. అందుకే ఇలా జరిగింది అన్నారట. దైవభక్తి మెండుగా ఉన్న ఆవిడ లెంపలు వాయించుకుని, గుడికి వెళ్ళి ప్రసాదం నోట్లో వేసుకున్న రెండో రోజు నొప్పి, వాపు తగ్గిపోయాయట.
అక్కడి నుండి కాశీ వెళ్ళి, తిరిగి ఊరు వచ్చాకా ఆవిడ పూర్తిగా మారిపోయింది అనుకుంటే మనం పప్పులో కాలేసినట్టే. కాకపోతే అన్నాన్ని, ప్రసాదాన్ని చూసే చూపు మారింది. 'అన్నం పరబ్రహ్మ స్వరూపం' అన్నదాన్ని పూర్తిగా జీర్ణించుకుంది.
పైగా తనని తాను అందరికన్నా ఎక్కువగా అనుకోవడం కూడా తగ్గిందిట. దైవ మహిమగా మాత్రమే నేను చూడలేదు ఈ కథని. ప్రయాణం ఆవిడ ఆలోచనను విస్తృతం చేసింది, అనుభవాలు ఆమె చూపుని మార్చాయి అనిపించింది.
ఆమె మార్పుకి నిదర్శనం కూడా కనిపించింది. కాశీ నుండి వచ్చిన వెంటనే మా పెద్ద అమ్మమ్మ పుట్టిందట. 'మీరు కాశీ వెళ్లి వచ్చినవారు కదా, మీ పేరు పెట్టుకుందాం అనుకుంటున్నాను అమ్మమ్మగారూ' అన్నదిట.
'నా పేరు ఎందుకు లేవే. ఆ అన్నపూర్ణమ్మ పేరు పెట్టుకో, నీ వంశానికి అన్నదాత అవుతుంది' అన్నదిట. ఏ ముహూర్తాన అన్నదో కానీ ఆవిడ, ఈనాటికీ మా ఎవరికైనా పత్యం పెట్టాలంటే అమ్మమ్మే, పచ్చగడ్డితో పచ్చడి చేసిన చేతులు నాకేస్తాం.
నీ వంశ చరిత్ర ఎవడు ఆడిగాడమ్మా అనకండి. కాశీ యాత్రా చరిత్ర విశ్లేషణ వింటే మా బామ్మ, అమ్మ చెప్పిన ఆ సుబ్బమ్మ గారి కథ గుర్తొచ్చింది. నాకు ఏం గుర్తొచ్చినా మీకు చెప్పనిదే నిద్ర రాదు అని తెలుసుగా, అందుకే ఈ వంశ చరిత్ర. సరే, ఈ వారపు న్యూస్ లెటర్, కథలు కబుర్లు ఇక్కడ ఉన్నాయి. వినేసి, చదివేయండి మరి. మీ వంశ చరిత్ర ఏమైనా గుర్తొస్తుందేమో..
Blog post = https://www.dasubhashitam.com/blog/196-yella-naati-telugu-pusthakam
Podcast = https://www.dasubhashitam.com/ab-title/pc-kathalu-kaburlu-3