Listen

Description

మనకు తెలిసిన ప్రపంచంలో సత్యం, అసత్యం రెండింటినీ చూస్తూ ఉంటాము. అసత్యము అనేది మన పరిస్థితుల వల్ల లేదా మన ఇంద్రియాలు మనస్సు యొక్క పరిమితుల వల్ల సత్యాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం తప్ప మరొకటి కాదని నిశిత పరిశీలన ద్వారా తెలుస్తుంది.       సుప్రసిద్ధమైన తాడు, పాము ఉదాహరణలో తాడు సత్యం, పాము సత్యమైన తాడు మీద ఆధారపడిన అసత్యం. కానీ సత్యమైన తాడును గ్రహించే వరకు మన ఆలోచనలు, చర్యలన్నీ అసత్యం పైనే ఆధారపడి ఉంటాయి. ఇటువంటి అసత్యాలు సమాజంలో తరతరాలుగా కొనసాగుతూ ఉంటాయి.       అదేవిధంగా, ఏదైనా సాంకేతికత పరిజ్ఞానాన్ని సత్యంగా పరిగణించినట్లయితే దాని దుర్వినియోగమే అసత్యం. లౌడ్ స్పీకర్ ను మంచిని ప్రచారం చేయడానికి, అమాయకులను మోసపూరితంగా హింసకు ప్రేరేపించడానికి కూడా ఉపయోగించవచ్చు. అదేవిధంగా, నేటి సోషల్ మీడియా అనేది సత్యమైతే దాన్ని దుర్వినియోగం చేసినప్పుడు అది అసత్యం అవుతుంది.       “బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణముల వారిని, వారి గుణ కర్మలను అనుసరించి వేర్వేరుగా సృష్టించితిని. ఈ సృష్టి కార్యక్రమమునకు నేనే కర్తనైననూ, శాశ్వతుడను, పరమేశ్వరుడను అయిన నన్ను, వాస్తవముగా 'అకర్తను' గా తెలుసుకొనుము” అని శ్రీకృష్ణుడు చెప్పారు (4.13).       అటువంటి విభజన గుణాలపై ఆధారపడి ఉంటుందని శ్రీకృష్ణుడు స్పష్టంగా చెప్పారు అంతేకానీ అవి పుట్టుకతో వచ్చేవి కాదు; క్రమానుగతమైనవి కావు. అంటే ఎవరు ఎక్కువా తక్కువా కాదని అర్థం. మూడు గుణాలు మనందరిలో వేర్వేరు నిష్పత్తులలో ఉన్నాయి. ఇవి కర్మ పరంగా నాలుగు విభజనలను కలిగిస్తాయి. మనం మన చుట్టూ చూస్తున్నప్పుడు కొంతమంది వ్యక్తులు జ్ఞానం, పరిశోధన పట్ల; కొందరు రాజకీయాలు, పరిపాలన పట్ల; కొందరు వ్యవసాయం, వ్యాపారం పట్ల; మరియు కొందరు సేవ, ఉద్యోగాల పట్ల సుముఖంతో ఉన్నట్లు గుర్తిస్తాము. ఈ విభజన ఇంద్రధనస్సులోని రంగుల్లా, భౌతిక ప్రపంచంలో ఐన్ స్టీన్, అలెగ్జాండర్, పికాసో, మదర్ థెరిసా వంటి విభిన్న రుచులను తెస్తుంది.       గుణాలు, కర్మల వల్ల మానవులు నాలుగు రకాలుగా ఉంటారనేది నిజమయితే విభజన అనేది క్రమానుగతమని, పుట్టుకపై ఆధారపడి ఉంటుందన్న అబద్దం దాని పై నిర్మించబడింది.