Listen

Description

“యోగముచేత కర్మలను త్యజించి, వివేకం ద్వారా సంశయములన్నింటినీ తొలగించుకొనుచు అంతరాత్మయందు స్థిరమైన వానిని కర్మలు బంధించవు (4.41). కావున, ఈ అజ్ఞానము వలన కలిగిన సందేహమును జ్ఞానమనే ఖడ్గంతో రూపుమాపి యోగములో స్థిరపడుము” అని శ్రీకృష్ణుడు చెబుతున్నారు (4.42). శ్రీకృష్ణుడు 'జ్ఞానం' అనే ఖడ్గాన్ని ఉపయోగించి మన కర్మబంధనాల నుండి విముక్తి పొందమని సలహా ఇస్తున్నారు. పశ్చాత్తాపము అనేది కర్మబంధనానికి ఒక పేరు. ఇది మనం చేసిన, చేయని కర్మల ఫలితంగా వస్తువులు లేక అనుబంధాల్లో కలిగిన నష్టానికి మనలో ఉద్భవించే భావము. అలాగే 'నింద' అనేది కర్మబంధనానికి మరో పేరు. ఇది ఇతరులు చేసిన, చేయని పనుల ఫలితంగా మన జీవితలలో వచ్చే కష్టాల వలన మనలో వచ్చే కోపము. పశ్చాత్తాపం, నింద అనే సంక్లిష్టమైన వల నుంచి మనల్ని మనం విడిపించుకోవడానికి సహాయపడే ఏకైక ఆయుధం జ్ఞానమనే ఖడ్గమే. భగవద్గీతలోని నాలుగవ అధ్యాయాన్ని 'జ్ఞాన కర్మ సన్యాస యోగము' అంటారు. ఇది పరమాత్మ కర్మలను ఎలా చేస్తారో అన్న విషయంతో ఆరంభమై 'యజ్ఞం' అనే నిస్వార్ధ కర్మ లాగానే మనం అన్ని కర్మలను చేయాలని చెబుతుంది. శ్రీకృష్ణుడు జ్ఞాన దృష్టి నుంచి కూడా అలా చేయబడిన కర్మలన్నీ ఎటువంటి మినహాయింపులు లేకుండా జ్ఞానంలో కలిసిపోతాయని అంటారు (4.33). ఈ శీర్షికలో 'జ్ఞాన' అంటే అవగాహన, 'సన్యాస' అంటే పరిత్యాగము. పరిత్యాగము అంటే పలాయనం కాదు; ఉద్యోగాలు, వృత్తులు లేక విషయాలను విడనాడి బాధ్యతల నుంచి తప్పించుకోవడం కాదు. పరిత్యాగం అంటే అవగాహన, వివేకముతో మనకు ఇవ్వబడిన కర్మలను మన శక్తి మేరకు చేయడం. నిజానికి ఇక్కడ తప్పించుకునే అవకాశం లేదు ఎందుకంటే శాంతికి కావలసిన జ్ఞానం మన లోపలే ఉంది. మనం దాన్ని గుర్తించడానికి నిరీక్షిస్తుంది. మనం అవగాహనతో నిండి ఉన్నప్పుడు నరకం కూడా స్వర్గంగా మారుతుంది, ఇందుకు విరుద్ధంగా ఒక అజ్ఞానపు మనస్సు స్వర్గాన్ని కూడా నరకంగా మారుస్తుంది. అంతర్గత పరిణామమే ఇక్కడ కీలకమైనది.